Telangana | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ఎక్కడి ఖమ్మం.. ఎక్కడి కందుకూరు(రంగారెడ్డి జిల్లా) వీటి మధ్య దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ఎక్కడి కరీంనగర్ ఎక్కడి వెంకటాపురం(ములుగు) వీటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. పోస్టింగేమో ఖమ్మం, కరీంనగర్.. పని చేయాల్సిందేమో కందుకూరు, ములుగు వెంకటాపురంలో. ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్తగా నియమితులైన లెక్చరర్ల పరిస్థితి. ఇంటర్ విద్యలో లెక్చరర్లను ఇష్టారీతిన ఆన్‌డ్యూటీ(ఓడీ)పై కేటాయించారు. దగ్గరా.. దూరం అని చూడకుండా కేటాయించారు. దీంతో వీరి అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఇలాంటి వారు 300 మంది వరకు ఉంటారని బాధితులు వాపోతున్నారు.
రాష్ట్రంలో జేఎల్ నోటిఫికేషన్ 14 ఏండ్ల తర్వాత విడుదలైంది. కేసీఆర్ సర్కారు ఇంటర్ విద్య చరిత్రలో ఒకేసారి 1,392 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 9న నోటిఫికేషన్ జారీచేసింది. 2023 సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. 2024 ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపారు. 100 పోస్టులు బ్యాక్లాగ్ అయ్యాయి. 1,292 కొత్త అధ్యాపకులకు కౌన్సెలింగ్ నిర్వహించి మార్చి 12న అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ అపాయింట్మెంట్స్ ఇచ్చే సమయంలోనే కొందరు లెక్చరర్లను ఆన్‌డ్యూటీపై ఇతర కాలేజీలకు కేటాయించారు. దీంతో ఆన్‌డ్యూటీ కేటాయించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. జీతాలు తీసుకునేది ఓచోట.. క్లాసులు చెప్పేది మరోచోట అన్నట్టుగా మారింది. కొందరు మార్చి 13న కాలేజీల్లో ప్రిన్సిపాళ్లకు రిపోర్ట్చేయగానే.. సదరు అధ్యాపకులను ఆన్‌డ్యూటీ కేటాయించిన కాలేజీలకు పంపాలని ఆదేశించారు. మరికొందరినేమో జూన్ 2 నుంచి కాలేజీలు పునఃప్రారంభమమయ్యే సమయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. దీంతో బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు.