హైదరాబాద్: రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అశ్రునయనాలతో ఆయనకు కుటుంబ సభ్యులు అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పాడె మోశారు. అంతకు ముందు రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు అంతిమయాత్ర కొనసాగింది. పెద్దసంఖ్యలో అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రామోజీ గ్రూప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
అంతమి సంస్కారాల్లో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కర్‌రావు, ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, వీ హనుమంత రావు, వెనిగండ్ల రాము, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నాయకులు సుజనా చౌదరి, రఘురామ కృష్ణరాజు, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్, పట్టాభి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూరి జస్టిస్ ఎన్వీ రమణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.