హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పచ్చటి పొలాల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా లంబాడీలు చేసిన పోరాటం ఫలించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలతో లంబాడీ రైతులపై కేసులు పెట్టి భూములు లాక్కోవాలని చూసిన కాంగ్రెస్ సర్కార్ పాచిక పారలేదని చెప్పారు. ఎన్ని వేధింపులకు పాల్పడినా ఎదురు నిలిచిన లంబాడీ మహిళల పోరాటం ఫలించిందని అన్నారు.
రేవంత్ సర్కార్ ఫార్మా విలేజీకి భూసేకరణ రద్దు చేయడం వెనుక లంబాడీ మహిళల పోరాటం కీలకమైందని అన్నారు. లగచర్ల లంబాడీల పోరాటానికి మద్దతుగా నిలిచి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. భూసేకరణ రద్దుతో పాటు అమాయక గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను కొట్టేయాలని డిమాండ్ చేశారు. జైళ్లలో మగ్గుతున్న గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని, తండాల్లో 144 సెక్షన్ ఎత్తేయాలని కోరారు.