షాద్నగర్, నవంబర్ 28: లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్నాయక్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
లగచర్ల, రోటిబండ తండా, ఇతర తండాల లంబాడీ రైతుల భూములను ఫార్మా కంపెనీల సొంతం చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. తండాల్లో అర్ధరాత్రి లంబాడీ ప్రజలను చిత్రహింసలు పెట్టి, జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే ఆ ప్రాంతాలకు ఫార్మా విలేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు రావని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇండస్ట్రియల్ కారిడార్ పేరుమీద లంబాడీల భూములను స్వాధీనం చేసుకోకుండా చూడాలని, కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో చనిపోయిన విద్యార్థుల చావులకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.