ఆదిలాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘మీకు భూములి చ్చి.. ఉపాధి కోల్పోయి మేం రోడ్డున పడాలా? ఎట్టిపరిస్థితుల్లోనూ రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇవ్వబోం’ అని ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని రామాయి గ్రామ రైతులు స్పష్టంచేశారు. సిమెంటు పరిశ్రమ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులతో బుధవారం ఆదిలాబాద్ ఆర్డీవో స్రవంతి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి వచ్చిన రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. భూ సేకరణ చేపట్టిన ప్రభుత్వం ఎకరాకు రూ.8.59 లక్షలు చెల్లిస్తున్నదని, భూములు కోల్పోతే తమకు ఉపాధి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎకరాకు రూ.40 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇతర ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉన్న భూములు చూపెట్టాలని డిమాండ్ చేశారు. నోటీసులు జారీ చేస్తూ రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము సూచించిన ధర ఇవ్వకపోతే భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.