వెంకటాపూర్, అక్టోబర్ 17: పశ్చిమబెంగాల్‌ని కోల్‌కతా నగరంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. ఇదేంటి రామప్ప తెలంగాణలో ఉన్నది కదా అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. రామప్పకు డూప్లికేట్‌ను దీపక్ గోష్ అనే ఆర్టిస్ట్ తన టీమ్సభ్యులతో కలిసి నిర్మించారు. అసలు ఆలయాన్ని రాళ్లతో కడితే.. ఇక్కడ దీపక్ గోష్ తన నిర్మాణంలో ఫైబర్, ైప్లె వుడ్, కర్ర, థర్మకోల్ను వినియోగించారు. 6 నెలల పాటు 85 మంది టెక్నీషియన్‌తో 100 మంది పైగా పని వారితో కలిసి తను ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత ఎలాగైనా ఈ ఆలయం నిర్మాణానికి డూప్లికేట్‌ను తయారు చేసుకోవాలని దీపక్ గోష్ నిర్ణయించారు. ఈ క్రమంలో గత మార్చిలో తన టీం ముఖ్య సభ్యులతో రామప్పకు వచ్చి ప్రతి శిల్పాన్ని ఫొటోలు, వీడియోలు తీసుకొని, కొన్ని శిల్పాలను డ్రాయింగ్ వేసుకొని వెళ్లారు. రామప్ప గురించి ప్రొఫెసర్ పాండు రంగారావు, టూరిజం గైడ్ ద్వారా ఎప్పటికప్పుడు కావాల్సిన సమచారం తెలసుకొంటూ తనదైన శైలిలో నిర్మాణం చేపట్టారు. వినాయకుడి విగ్రహం, ద్వారా పాలికలు, ఏనుగులు, గజకేసరిలు మదనికల శిల్పాలు, స్తంభాలు అచ్చు గుద్దినట్టు రామప్ప శిల్పాలను పోలిన విధంగా మలిచారు. దీని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు చేశారు.