హనుమకొండ చౌరస్తా, జనవరి 20: వరంగల్ రామప్ప ఫెస్టివల్లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడాగ్రౌండ్లో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ మల్లిక సారాభాయ్ బృందం నృత్య ప్రదర్శన చేయనున్నట్టు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రభుత్వ సలహాదారు పాపారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
2008లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చాక.. ఇక్కడ ఫెస్టివల్ నిర్వహించేందుకు కేంద్ర ఆర్కియాలజీ, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసినా అనుమతి ఇవ్వలేదన్నారు. దీంతో కాకతీయుల నగరమైన హనుమకొండలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మల్లిక సారాభాయ్ 15 మంది బృందంతో 17 నిమిషాల పాటు ‘నటరాజ వందనం’ నృత్య ప్రదర్శన చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.