హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఆర్థికశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. ఆయన సేవలను సదా గుర్తు చేసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థికశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు వ్యవహరిస్తుండటం విశేషం. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పుడు ఎన్నో భయాలు ఉన్నయ్. ఆర్థికంగా బలంగా లేకుంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై అప్పటికే ఉన్న భ్రమలన్నీ నిజమైపోతాయనే భయం ఉండేది.
అందుకే కొత్తగా పుట్టిన పసికూనను ఎంత జాగ్రత్తగా పెంచాలో అట్ల పెంచినం. అంత జాగ్రత్తగా సాకితేనే ఇవన్నీ సాధ్యమైనయ్. అంతే తప్ప ఆషామాషీ కబుర్లు కాదు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురించి. తెలంగాణ ఆర్థిక సౌష్టవాన్ని, ఆర్థిక క్రమశిక్షణను.. కేంద్రం ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎఫ్ఆర్బీఎం కోతలు విధించినా, నిధుల విడుదలలో జాప్యం చేసి నా, ఎన్ని దుర్మార్గాలు చేసినా తట్టుకుని నిలబెట్టిన గొప్ప వ్యక్తి రామకృష్ణారావు. ఆయన సేవలను సదా మేం గుర్తుంచుకుంటాం. అదేవిధంగా ప్రస్తుత సీఎస్, గతంలో పనిచేసిన సోమేశ్‌కుమార్, ఇతర సెక్రటరీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.