హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మంగళవారం లీగల్ నోటీసులు పంపారు. హెచ్సీయూ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు రాంచందర్రావు కారణమని, అలాంటి వ్యక్తికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం ఏమిటని భట్టివిక్రమార్క ఇటీవల ప్రశ్నించడంతోపాటు దళితులను ఇబ్బందులకు గురిచేసిన వారికి బీజేపీ పదవులు ఇస్తున్నదని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే భట్టివిక్రమార్కపై క్రిమినల్ కేసు దాఖలు చేయడంతోపాటు రూ.25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని లీగల్ నోటీసుల్లో రాంచందర్రావు స్పష్టం చేశారు.