పోచమ్మమైదాన్, నవంబర్ 26 : వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రొఫెసర్ రామా చంద్రమౌళి ‘జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. మధ్యప్రాచ్య అరబ్ దేశ రాజధాని దోహా (ఖతార్) వేదికగా జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని వంగూరు ఫౌండేషన్, అమెరికా, ఆంధ్ర కళావేదిక ఖతార్ సంయుక్తంగా ఆయనకు అందజేసి గౌరవించారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సదస్సులో డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వర్రావు, డాక్టర్ వంశీరామరాజు, వెంకప్ప భాగవతుల చేతులమీదుగా సత్కారంతోపాటు అవార్డును అందుకున్నారు. ‘మదర్స్ రూం, శిశువు చిత్రనిద్ర’ పుస్తకాలను ఇదే వేదికపై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ ఆచార్య లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహితీ సౌరభాలు వెదజల్లేలా దోహా వేదికగా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు.