Pharma City | యాచారం, డిసెంబర్ 29 : ఫార్మాసిటీని రద్దు చేసే దాకా తమ పోరాటం తగదని రైతులు కదం తొక్కారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ తీశారు. ‘ఫార్మా గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కగానే మాట మార్చిందని రైతులు ధ్వజమెత్తారు. తమ వెంట ఉన్నట్టు నటించి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్రలు, ఆందోళనలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు పదవులు రాగానే ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ ఫార్మాసిటీ రద్దు కోసం రైతులు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
ఫార్మా కంపెనీల ఏర్పాటుతో కలిగే నష్టాలపై రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముచ్చర్లలోనే ఫార్మాసిటీ అంటూ ఇటివలే మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించారని, సీఎంరేవంత్‌రెడ్డి మాత్రం ఫార్మాసిటీ, ఫ్యూచర్‌సిటీ, ఫోర్త్‌సిటీ, ఏఐసిటీ అంటూ రోజుకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. యాచారం, కందుకూరు మండలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రాంతాలు ఖాళీ చేయాల్సి వస్తుందని, మంచినీరు, చెరువునీరు కలుషితమవుతుందని, ప్రజలు రోగాల బారిన పడతారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేశారు. బేగరికంచెలో రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెంటనే వారికి కేటాయించాలని కోరారు.
రైతులకు అండగా ఉండాల్సిన కాంగ్రెస్ నేతలు ఫార్మా రద్దు విషయంలో మౌనం వహించడం సరికాదని సూచించారు. యాచారం, కందుకూరు మండలాల ఫార్మా బాధితులు, రైతులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులు, ఇథనాల్ ఫ్యాక్టరీ బాధితుల తరహాలోనే సర్కారుపై సమరం చేయాలని కోరారు. ఏదేమైనా యాచారానికి ఫార్మాను రానిచ్చేదిలేదని స్పష్టంచేశారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీకి మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతో పాటు కందుకూరుకు చెందిన రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇకపై నిత్య ఉద్యమాలతో సర్కారుకు ఫార్మా రైతుల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల తరఫున ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తిచేశారు. డిసెంబర్ 30న తాటిపర్తి, 31న నానక్‌నగర్, జనవరి 1న మేడిపల్లిలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులు కుందారపు సత్యనారాయణ, కానమోని గణేశ్, సామ నిరంజన్, అచ్చిరెడ్డి, మహిపాల్, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు