హైదరాబాద్,జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం, మంత్రుల సరదాలకు కోట్లు.. అన్ని వర్గాలకు తూట్లు అన్నట్టుగా పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తన మనవడు సరదా తీర్చేందుకు కోట్లు ఖర్చు చేసి మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ పెట్టించారని , తన సరదా కోసం అందాల పోటీలు పెట్టారని మండిపడ్డారు. రూ. 42 వేల టీషర్ట్, రూ. 90 వేల బూట్లు, రూ. 6 లక్షల హెర్మన్ జాకెట్ వాడుతూ రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్‌గా కాకుండా కాస్ట్లీ మినిస్టర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు.
సీఎం ఇలా ఉంటే తామేం తక్కువ.. అన్నట్టుగా మంత్రులు అదే కోవలో నడుస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి భట్టి విక్రమార్క తాగే నీటి బాటిల్‌కు రూ. 3,489 ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును అప్పనంగా ఖర్చు చేస్తూ విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి 70 సార్లు ఢిల్లీకి వెళ్లి రూ. 400 కోట్లు ఖర్చు చేస్తే.. మంత్రులు ఆటోల్లా హెలికాప్టర్లను వాడుతూ వృథా ఖర్చు చేస్తున్నారని చురకలంటించారు.
ఈ ఖర్చుతో విద్యార్థులకు ఒక ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ వేయొచ్చని తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బకాయిలతో మాకేం సంబంధం అన్నట్టు వ్యవహరించడం సరికాదని విమర్శించారు. బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. యూనివర్సిటీల భూములను అమ్ముకోవడానికి చూపుతున్న ముందడుగు, ఈ విద్యాసంస్థలను కాపాడటంలో లేకపోవడం దారుణమని మండపడ్డారు.
రాష్ట్రంలో దోపిడీ చేసిన సొమ్మును ఢిల్లీకి కప్పంగా తరలిస్తున్నారని రాకేశ్‌రెడ్డి విమర్శించారు. మంత్రుల కాంట్రాక్ట్ కంపెనీలకు మాత్రం బిల్లులు చకచకా చెల్లిస్తున్నారని, కమీషన్లు వసూలు చేస్తూ ఢిల్లీకి మూటలు మోస్తున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ అంటూ లక్షల కోట్లు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారని ఆయన నిలదీశారు.
ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజా అసంతృప్తి వల్లే సమాజంలో ‘కాక్రోచ్’ లాంటి కొత్త రాజకీయ శక్తులు పుట్టుకొస్తున్నాయని రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాజీలేని పోరాటం చేస్తున్నదని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తే, రాష్ట్రంలో ‘జెన్‌జీ’ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలు పుట్టుకొస్తాయని హెచ్చరించారు.