సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత జాబితాలో చేరుస్తూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. హైదరాబాద్లో ఇండ్లు, స్థలాలు కొనాలన్నా.. అమ్మాలన్నా వీలుకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల ఇండ్లు, స్థలాలు, వెంచర్లు, కాలనీలు, సొసైటీలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుతున్నది.
ఇప్పటికే గ్రేటర్లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే 22ఏలో చేర్చిన ఉదంతాలు ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. హైరైజ్డ్ భవనాలు, అపార్ట్మెంట్లలోని వేలాది ఫ్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో పైసా పైసా కూడబెట్టుకుని, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కొనుక్కున్న కలల సౌధాన్ని ప్రభుత్వం తనదంటుండటంతో వేతన జీవులు కుంగిపోతున్నారు. ఏండ్ల తరబడిగా పట్టా భూములుగా కొనసాగిన తమ స్థలాలు ఉన్నట్టుండి నిషేధిత జాబితాలోకి చేర్చడంపై ఆందోళన చెందుతున్నారు.
ఇదేంటని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. దిక్కుతోచని స్థితిలో న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్తున్నారు. కోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.