హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తొలిరోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. బీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి ఎన్నికయ్యే వారు 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ పేర్కొన్నది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆగస్టు 27న ప్రకటిస్తారు. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు.
15 వరకు రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. హైదరాబాద్లో మరో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
నేడు వైద్యసేవల బహిష్కరణ
కోల్కతా ఘటనను నిరసిస్తూ జూడాలు, సీనియర్ రెసిడెంట్ల నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కోల్కతాలో వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ, ఓటీ సేవలను బహిష్కరిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు, సీనియర్, సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్లు ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈనిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఏఐతో కంటెంట్ రైటింగ్లో శిక్షణ
హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో కంటెంట్ క్రియేటివ్ రైటింగ్లో 27 నుంచి 29 వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దరఖాస్తు చేసుకొనే తొలి 40 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆ సంస్థ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు పనిచేస్తున్న సంస్థ హెడ్వోడీ నుంచి లేదా రిపోర్టింగ్ ఆఫీసర్ నుంచి సిఫారసు లేఖతో kskrishnaraj. nird@gov.inకు ఈమెయిల్ పంపించాలని సూచించింది. వివరాలకు 7560811100/040-24008468 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరింది.
మహాలక్ష్మిలకు ‘రాఖీ’ బంపర్ ఆఫర్
హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతులకు, మహిళలకు 19న రక్షాబంధన్ సందర్భంగా ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. రాఖీలు, స్వీట్లు బట్వాడా కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. బుక్ చేసిన కౌంటర్ నుంచి 24గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు రాఖీలను, స్వీట్లను పంపించుకోవచ్చు అని పేరొంటున్నారు. యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తిచేసింది. వివరాలకు https// www. tgrtclogistics.co.inలో సంప్రదించాలని కోరారు.