కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను మరోసారి నిరాశపరిచిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 54.1 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టి.. అందులో తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని ఒక ప్రకటనలో విమర్శించారు. దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న తెలంగాణకు ఈ బడ్జెట్లో కూడా తీవ్ర అన్యాయం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆర్ఆర్ఆర్, మెట్రో రైలు మార్గం విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులకు పైసా కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. ఐఐఎం, నవోదయ, సెంట్రల్ సూల్స్ ఏర్పాటు ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం నుంచి 8+8 మంది లోకసభ సభ్యులు ఉన్నా.. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నా బడ్జెట్లో తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష కొనసాగడం బాధాకరమని వద్దిరాజు పేర్కొన్నారు.