భద్రాచలం, ఆగస్టు 17 : పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి నదీ ప్రవాహం వెనక్కి రావడం వల్ల భద్రాచలం పట్టణంతోపాటు పరిసర గ్రామాలకు ముప్పు మరింత పెరిగిందని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ జాన్ బిట్రాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గోదావరి వరదలు ఏటా భద్రాచలం పట్టణాన్ని ముంచెత్తుతున్నాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే ఈ వరదల తీవ్రత మరింత పెరగనుందని పేర్కొన్నారు. పోలవరం కాఫర్ డ్యాం వల్ల ప్రజలు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.
ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో భద్రాచలానికి తిరుగులేని నష్టం సంభవిస్తుందని తెలిపారు. చారిత్రక నేపథ్యం ఉన్న భద్రాచలం శ్రీరాముని దేవాలయం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షను విడనాడాలని సూచించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రాలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాలో ఆ పంచాయతీలు కలిసినప్పటికీ విద్య, వైద్యం, రవాణా వంటి అంశాల కోసం భద్రాచలంపైనే ఆధారపడుతున్నారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శనరావు, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్రకమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య పాల్గొన్నారు.