హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) జైత్రయాత్ర కొనసాగుతుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా అని వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వానికే ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటున్నాయి. కేసీఆరే పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని ఇప్పటికే ఇండియా టీవీ, మిషన్ చాణక్య, ఎన్పీఐ, ఈఎన్ టీవీ వంటి సర్వేలు తేల్చిచెప్పాయి. తాజాగా, రాజ్‌నీతి సర్వేలో (Rajneethi Opinion Poll) బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేలింది.
బీఆర్ఎస్ పార్టీకి 77 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. ఉచితాలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ 29 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ 6 స్థానాలతో మరోసారి సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది. బీఎస్పీ అసలు ఖాతాయే తెరిచే అవకాశం లేదని తేలింది. అక్టోబర్ 28 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన రాజ్‌నీతి.. సర్వే ఫలితాలను సోమవారం ఉదయం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఏడు స్థానాలు మినహా రాష్ట్రంలోని 112 నియోజకవర్గాల్లో ఈ సర్వేని నిర్వహించింది.
ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్ఎస్కు 43.35 శాతం ఓట్లు పోలవుతాయని అందులో వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కారు పార్టీకి 50 శాతం ఓట్లు రానుండగా, పట్టణ ప్రాంతాల్లో 42 శాతం ఓట్లు వస్తాయని తేలిపింది. ఇక వయస్సుల వారీగా చూస్తే.. 30 ఏండ్ల లోపు వయస్సు ఉన్న ఓటర్లలో 38 శాతం మంది బీఆర్ఎస్కు మద్దతు తెలపగా, 31 నుంచి 40 ఏండ్లలోపువారు 40 శాతం, 41-50 ఏండ్ల వయస్కులు 48 శాతం, 51-60 ఏండ్ల వయస్కులు 50 శాతం, 61 ఏండ్లు పైబడినవారు 51 శాతం మంది తాము కేసీఆర్‌కే జై కొడతామని స్పష్టం చేశారు.