Rajeev Yuva Vikasam | కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట యువకులకు ఎన్నెన్నో హామీలు గుప్పించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కుతున్నది. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతినెలా రూ. 4 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, విద్య ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటుచేసి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తామని హామీలు ఇచ్చింది. అయితే, అందులో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా, ‘రాజీవ్ యువ వికాసం’ పేరిట కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చి యువకుల్లో ఆశలు రేపింది. నాలుగు క్యాటగిరీలుగా రూ. 50వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తామని ఊదరగొట్టి దరఖాస్తులు స్వీకరించిన సర్కారు ఇప్పుడు ఆరు లక్షలపై చిలుకు దరఖాస్తులను తిరస్కరించి నిరుద్యోగుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది.
ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, అందులో 15.53 లక్షల దరఖాస్తులు వెరిఫై అయ్యాయి. అయితే, వీటిలో 6.6 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం, పథకం అమలుపై ప్రభుత్త చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా రూ. 50 వేల యూనిట్‌కు 100 శాతం, రూ. లక్ష యూనిట్‌కు 90 శాతం, రూ. 2 లక్షల యూనిట్‌కు 80 శాతం, రూ. 4 లక్షల యూనిట్‌కు 70 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో క్యాటగిరి-1లో రూ. 50 వేలు, క్యాటగిరి-2లో రూ. లక్ష వరకు ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల 9 నాటికి మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15 లోగా శిక్షణ ఇచ్చి నెలాఖరులో గ్రౌండింగ్ చేయాలని భావించింది. అయితే ఇప్పుడా ఆలోచనను ప్రభుత్వం విరమించుకున్నది.
రాజీవ్ యువ వికాసానికి వివిధ కార్పొరేషన్ల వారీగా 16,23,643 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఇప్పటివరకు 15,53,551 దరఖాస్తులను సంబంధిత అధికారయంత్రాగం పరిశీలించి వాటిలో 13,83,950 దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. అంటే ఇక్కడ 1,69,601 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు, బ్యాంకర్లు సిబిల్ స్కోరు, లావాదేవీల ఆధారంగా మరికొన్ని పేర్లను తొలగించి 8,93,219 మందిని మాత్రమే ఎంపిక చేస్తూ ప్రభుత్వానికి జాబితా పంపారు. అంటే మొత్తంగా రెండు విడతల్లో 4,90,731 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.
మొత్తంగా చూసుకుంటే మాత్రం 6,60,332 దరఖాస్తులు రిజెక్టయ్యాయి. అంటే, దరఖాస్తుదారుల్లో 45 శాతం మందిపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్టు అయింది. విషయం బయటకు వస్తే యువత నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఈ పథకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని అమలు చేయాలని తొలుత అనుకున్నా, ఇప్పుడు ఎన్నికలు అయ్యాక మాత్రమే అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది.