హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు సంబంధించిన గెజిట్‌లో చేసిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖకు సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను అనుసరించి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు అప్పగించేందుకు కేంద్ర జల్‌శక్తిశాఖ 2021 జూలై 15న గెజిట్‌ను జారీ చేసింది. ఆ గెజిట్‌ను అనుసరించి అనుమతులు లేకుండా ఇప్పటికే నిర్మించిన, ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతులు పొందాల్సి ఉన్నది.
ఆ జాబితాలో ఇరు రాష్ర్టాల ఆరు ప్రాజెక్టులను కేంద్రం చేర్చింది. తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడుతోపాటు ఏపీకి చెందిన హంద్రీనీవ, తెలుగుగంగ ప్రాజె క్టు హెడ్‌వర్క్స్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల కేంద్రం గతంలో జారీచేసిన గెజిట్‌ను సవరించింది. అనుమతులు తీసుకోవాల్సిన నిబంధనల నుంచి 6 ప్రాజెక్టులను మినహాయించింది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బేసిన్ ప్రా జెక్టులను, అవుట్ బేసిన్ ప్రాజెక్టులను ఒకేగాటన కట్టడం సరికాదని వెల్లడించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్ ఎదుట వాదనలు కొనసాగుతున్నాయని తెలిపింది.