హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి తన అక్కసును వెళ్లగక్కరు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి నుంచి అధికార పార్టీలోకి మారిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను.. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు, అనవసరంగా వచ్చారంటూ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి రాజగోపాల్ రెడ్డి వెళ్తున్న క్రమంలో.. చిలుకూరులోని పెద్దచెరువును పరిశీలిస్తూ కనిపించిన ఎమ్మెల్యే కాలె యాదయ్య వద్దను పలకరించారు. ‘యాదన్నా.. ఎందుకు వచ్చినవే కాంగ్రెస్‌లోకి. ఈ ప్రభుత్వంలో ఏ పనులు కావు. అనవసరంగా వచ్చినవ్’ అని చెప్పారు. దీనికి ఆయన స్పందించనప్పటికీ.. చిరునవ్వు చిందించారు.
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల విచారణలో భాగంగా బుధవారం ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డిల క్రాస్ ఎగ్జిమినేషన్ జరగనున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ శాసనసభ్యుల తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేసన్ ప్రక్రియ కొనసాగనున్నది. బుధవారంతో తొలి దఫా విచారణ కార్యక్రమం ముగియనున్నది. తదుపరి దసరా పండుగ తర్వాత మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో పిలుస్తారని చెప్తున్నారు. ఈ నెల ఆరో తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తారని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని చెప్తున్నారు.