హైదరాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణలోని కర్మాగారాల్లో జరిగే అగ్నిప్రమాద మరణాలు, షాపింగ్ మాల్స్ సహా ఇతర చోట్ల జరిగే అగ్నిప్రమాద మరణాల కన్నా తక్కువేనని రాష్ట్ర ఫ్యాక్టరీల డైరెక్టర్ రాజగోపాల్రావు పేర్కొన్నారు. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం కర్మాగారాల్లో అగ్నిప్రమాదాల నివారణపై ఎఫ్‌టీసీసీఐలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో రాజగోపాల్రావు మాట్లాడారు. నివాస ప్రాంతాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్, కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు, దవాఖానలు, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు సహా అనేక ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఫ్యాక్టరీల్లో మాత్రం మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు.
ఆయిల్, పేలుడు పదార్థాల తయారీ, ఫార్మా, కెమికల్ పరిశ్రమలకు తెలంగాణ కేంద్రంగా ఉన్నప్పటికీ ప్రమాదాలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ప్లానింగ్, డిజైన్, , అగ్నిప్రమాదాల నివారణపై సరైన శిక్షణ ద్వారా వీటిని నివారించవచ్చని తెలిపారు. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవడం, బయటకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు, సమీప ఫ్యాక్టరీలతో పరస్పర సహకారం తదితర చర్యలు కూడా ప్రమాదాల నివారణకు ఎంతో అవసరమని గోపాలరావు వివరించారు.