Raj Pakala | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్‌పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలన్న పిటిషనర్ అభ్యర్థనకు కోర్టు సమ్మతించింది. రెండు రోజుల గడువు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మోకిల స్టేషన్‌హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)/సబ్ఇన్స్పెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేశారు. ఏదైనా పార్టీలో డ్రగ్స్ వినియోగించిన వాళ్లు పట్టుబడితే వాళ్లకు చట్ట ప్రకారం పడే శిక్ష ఆరు మాసాలేనని, ఇలాంటి కేసుల్లో నోటీసులు జారీ చేయవచ్చు కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
సోమవారం ఉదయం 9.30కు నోటీసు అందజేసి అదే రోజు ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలంటే ఎలాగని హైకోర్టు పోలీసులను నిలదీసింది. ఈ చర్య నిష్పాక్షిక దర్యాప్తుపై సందేహాలు ఉన్నాయన్న పిటిషనర్ అభియోగాలకు బలం చేకూర్చడం లేదా అని ప్రశ్నించింది. అందుకే నోటీసుపై పిటిషనర్ స్పందించేదాకా ఆయనపై మోకిలా సీఐ, ఎస్సైలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తున్నామని వెల్లడించింది. ఉదయం కోర్టు ప్రారంభం కాగానే తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని రాజ్‌పాకాల తరఫు సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి కోరారు. భోజన విరామం తర్వాత విచారణకు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి అంగీకరించారు. పోలీసులు హడావుడిగా దర్యాప్తు చేసి కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందంటూ మయూర్‌రెడ్డి ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారు.
తొలుత పిటిషనర్ తరఫున మయూర్రెడ్డితోపాటు న్యాయవాది విమల్‌వర్మ వాసిరెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో పిటిషనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. కొత్త ఇంట్లోకి వెళ్లిన సందర్భాన్ని పురసరించుకుని దీపావళి పండుగకు ముందు ఇంట్లో బంధువులతో దావత్ చేసుకుంటే ఏదో జరిగిపోయినట్టు పోలీసులు భారీ సంఖ్యలో వచ్చి నానా హంగామా సృష్టించారని తెలిపారు. రాజ్ పాకాల ఉద్యోగి విజయ్‌కి వైద్య పరీక్ష నిర్వహిస్తే డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పి పిటిషనర్‌ను కేసులో ఇరికించారని ఆరోపించారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు ముందుగానే హెచ్చరించడాన్ని బట్టి వాళ్లు పిటిషనర్‌ను ఏం చేయబోయేదీ అర్థం అవుతున్నదని అన్నారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ ప్రతివాదనలు చేస్తూ, పిటిషనర్‌కు పోలీసులు 41ఏ నోటీసులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. ఆ ఇంట్లో అక్రమంగా దాచిన విదేశీ మద్యం సీసాలు లభ్యం అయ్యాయని చెప్పారు. మద్దూరి విజయ్ కొకైన్ తీసుకున్నట్టు పరీక్షల్లో తేలిందని అన్నారు. రాజ్పాకాలతో విజయ్‌కి ఐదేండ్లుగా సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కేసు వెనుక రాజకీయ ఉద్దేశమే లేదని అన్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన ఆధారాలు, సమాచారం ఆధారంగానే కేసు దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.
రాజకీయ విభేదాలతో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలపై తప్పుడు కేసు నమోదు చేశారని న్యాయవాదులు చెప్పారు. ఓ మంత్రి కేటీఆర్‌పై ఇటీవల తీవ్ర పదజాలంతో మాట్లాడితే, ఆయన పరువు నష్టం దావా వేశారని గుర్తుచేశారు. మరో మంత్రి దీపావళి పండుగలోగా బీఆర్ఎస్ నేతలపై రాజకీయ బాంబ్ పేలుతుందని చెప్పారని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసుల్ని బనాయించేందుకు తెర తీశారని అన్నారు. నూతన గృహ ప్రవేశ వేడుకలకు బంధువులు, స్నేహితులంతా ఉండగా పోలీసులు చట్ట వ్యతిరేకంగా ఫాంహౌస్‌లోకి చొరబడ్డారని చెప్పారు.
కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పోలీసులు ఏకపక్షంగా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు తెలిపారు. పోలీసులు అత్యుత్సాహంతో ఆ ఇంట్లోనే ఉన్న మహిళలు, బంధువులు, స్నేహితులకు బలవంతంగా యూరిన్ టెస్ట్ చేయించారని, డ్రగ్స్ వినియోగించినట్టు ఏ విధమైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో పిటిషనర్‌ని కేసులో ఇరికించాలనే కుట్రకు తెరతీశారని తెలిపారు. ఎలాగైనా కేటీఆర్ బావమరిదిని అరెస్టు చేయాలనే కుట్రపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్ల మేరకే పనిచేస్తున్నారని అన్నారు.