Congress Govt | రవీంద్రభారతి, జనవరి 12: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 63 సంవత్సరాలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని, దీని వల్ల ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని జాతీయ ఓబీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ హెచ్చరించారు. ఉద్యోగ విరమణ వయసును పెంచడమంటే లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినట్టేనని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, ఎన్ని డిమాండ్లు వచ్చినప్పటికీ ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం బషీర్‌బాగ్‌లోని ఫోరం కార్యాలయంలో రామకృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ వయసును పెంచనున్నట్టు గత మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఖండించలేదని పేర్కొన్నారు. ఈ వార్తలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరుద్యోగులతోపాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో నిరుద్యోగులే కీలకపాత్ర పోషించారని, జాబ్ క్యాలెండర్ కోసం వారు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించకపోతే రాష్ట్రంలోని నిరుద్యోగులు సంఘ విద్రోహశక్తులుగా మారే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.