Rains | హైదరాబాద్ : రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాగల మూడు రోజులలో రిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుండి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టం నుండి 1.5 నుండి 5.8 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుండి ద్రోణి ఒకటి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 & 5.8 కి. మీ ఎత్తులో ఏర్పడింది. ఈ ద్రోణి ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో.. ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రం లోని కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులు కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు గంటకు 30-40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.