Rains | హైదరాబాద్ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగళ్ల వాన కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. ఉక్కపోత నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగింది. వారం రోజుల క్రితం వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అయ్యాయి. మళ్లీ ఇవాళ కాస్త ఎండలు నెమ్మదించాయి.
మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్‌పల్లి, గగిల్లాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వాన దంచికొట్టింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.