Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తేతెలంగాణ): రానున్న మూడ్రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశమున్నదని అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో వడగండ్ల వర్షం పడొచ్చని సూచించింది.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్.. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. ద్రోణి ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశమున్నదని పేర్కొంది. బుధవారం భద్రాచలం -కొత్తగూడెం జిల్లా లో 39.4 డిగ్రీలు, ఖమ్మంలో 37.4, ఆదిలాబాద్లో 37, నిజామాబాద్లో 36.5, మెదక్లో 36.3 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది.