హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌తోపాటు నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో తుఫాను ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన టీటీడీ.. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.