TG Weather | గడిచిన 24గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రాంతం నుంచి కర్ణాటక – గోవా తీరం.. కేరళ, తమిళనాడుగా మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.. సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ క్రమంలో రాగల మూడురోజులు తెలంగాణలో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వానలుపడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నల్గొండ, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.