హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇటు రుతుపవనాలు, అటు అరేబియా సముద్రంలో తుఫాను ప్రభావంతో ఈ వానలు పడుతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 5.02 సెంటీమీటర్ల వాన పడింది.