తిరుమలాయపాలెం/టేకులపల్లి/కూసుమంచి/త్రిపురారం, మే 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతోపాటు ఇండ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. గాలిదుమారంతో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం స్టేజీ సమీపంలో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలిపోయాయి. గంటలతరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జేసీబీ వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు, పోలీసులు గొడ్డళ్లతో చెట్ల కొమ్మలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. టేకులపల్లి మండలం బోడు, మొక్కంపాడుతండా, రామచంద్రునిపేట, కొప్పురాయి, బర్లగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో సాయంత్రం తీవ్రమైన గాలు లు, ఉరుములతో వర్షం కురిసింది. మొక్కంపాడుతండాలో బానోత్ రవి ఇంటి ఆవరణలో ఉన్న వేప చెట్టు విరిగి ప్రహరీపై పడింది. అదే తండాకు చెందిన బానోత్ నరేశ్‌కు చెందిన ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
క్రికెట్ ఆడుతున్న యువకులపై పిడుగు
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెంలో మంగళవారం సాయంత్రం కొందరు యువకులు క్రికెట్ ఆడుతుండగా ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. వారంతా సమీపంలోని తాటి చెట్ల వద్దకు వెళ్లి నిలబడ్డారు. అదే సమయంలో తాటి చెట్టుపై పిడుగుపడటంతో మర్రి రుషి (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నల్లగొండ మండలం వెలుగుపల్లికి చెందిన మర్రి రుషి (20) హైదరాబాద్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో నీలాయగూడెంలోని మేనమామ ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చాడు.