హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): చిన్నారుల గుండె శస్త్రచికిత్సలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కొత్త చరిత్ర సృష్టించింది. గర్భంలో ఉన్న పిండం గుండె పనితీరును గుర్తించి, చికిత్స చేయడ మే క్లిష్టమైన ప్రక్రియ. కాగా కడుపులో ఉన్న శిశువు గుండెకు రంధ్రం చేసి, ఆ రంధ్రం ద్వారా విజయవంతంగా చికిత్స జరిపి కొత్త రికార్డు సృష్టించారు రెయిన్బో దవాఖాన వైద్యులు. ఈ పద్ధతి ప్రపంచంలోనే తొలిసారి చేసినట్టు హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వర్రావు వెల్లడించారు.
హాస్పిటల్లో శుక్రవారం ఆ యన మీడియాతో మాట్లాడుతూ.. కొంత మంది పిల్లల్లో పుట్టకముందే అయోటిక్ వాల్వ్ మూసుకుపోతుందని చెప్పారు. శిశువుకు గుండెలో పెద్ద రంధ్రం చేసి, దాని ద్వారా బెలూన్ను పంపించి అయోటిక్ వాల్వ్‌ను విజయవంతంగా ఓపెన్ చేశామని డాక్టర్ కోనేటి వివరించారు. ఈ ప్రొసీజర్‌కు ‘ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమి అండ్ డివైజ్ క్లోజర్’ అని పేరు పెట్టినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఈ పద్ధతిలో శస్త్రచికిత్స ఎక్కడా చేయలేదని, భవిష్యత్తులో రకరకాల ప్రొసీజర్స్‌ను ఈ పద్ధతిలో చేయవచ్చని వివరించారు. సమావేశంలో రెయిన్బో సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల పాల్గొన్నారు.