Telangana | ఖమ్మం/సూర్యాపేట/కౌటాల, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగలింది. బాధితులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బిక్కముఖం వేశారు. బాధితుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. మూడు రోజులుగా తిండీతిప్పల్లేకుండా, వరద నీటిలో బిక్కుబిక్కుమని గడుపుతుంటే తీరిగ్గా వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులపై బాధితులు విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ. 10 వేలు సాయం అందిస్తామని సీఎం చెప్పగానే వారిలో ఆగ్రహం మరింతగా కట్టలు తెంచుకుంది. ‘మీరిచ్చే రూ. 10 వేలు వద్దు.. మీరూ వద్దు.. ఆ పది వేలకు ఒక్క సామాను కూడా రాదు’ అంటూ ఖమ్మం మహిళలు ముఖ్యమంత్రి రేవంత్ ముఖం మీదే తేల్చి చెప్పారు. ‘వరద నీటిలో చిక్కుకొని రెండు రోజులుగా నరకం అనుభవిస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదని, అన్నపానీయాలు లేకుండా మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మాకు ఈ ప్రకటనలు, హామీలు వద్దు.. సాయం చేయండి’ అంటూ డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా శని, ఆదివారాల్లో ఖమ్మంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలను ముంచేసింది. వరద నీటిలో చిక్కుకొని నరకం చూసిన ప్రజలను పరామర్శించేందుకు, జరిగిన నష్ట తీవ్రతను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఖమ్మం వచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు నీటమునిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితుల బాగోగుల గురించి అడిగి తెలుసుకోబోయారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఆచూకీలేని ప్రభుత్వ పెద్దలు సోమవారం పరామర్శకు రావడంపై బాధితులు భగ్గుమన్నారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో మహిళలు నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి ఎదుటే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం నగరంలో ఆయన పర్యటనను నిరసిస్తూ వ్యర్థాలను రోడ్డుపై పోయించి నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాము జల ప్రళయంలో చిక్కుకున్నా తమను ఎవరూ పట్టించుకోలేదన్న విషయాన్ని సీఎంకు చెప్పేందుకు వెళ్తున్న పలువురు మహిళలను మగ పోలీసులు లాగిపడేశారు.
పోలేపల్లిలో సీఎంకు నిరసన సెగ
వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డికి నిరసన ఎదురైంది.మండలంలోని పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీలో సీఎం పర్యటిస్తున్న సమయంలో స్థానికులు అడుగడుగునా అడ్డుతగిలారు. మంత్రి పొంగులేటి తమ కాలనీకి వచ్చి తమ కష్టాన్ని చూడాలంటూ ఉదయం 8 గంటల సమయంలో ఖమ్మం బైపాస్‌పై సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. పర్యటనలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు రేవంత్ అదే కాలనీకి వెళ్లాల్సి ఉంది. దీంతో కాలినడకన వచ్చిన తమ ఇండ్లలోని పరిస్థితిని చూస్తారని కాలనీవాసులు ఆశపడ్డారు. కానీ సీఎం కాలినడక కాకుండా ఓపెన్‌టాప్ జీప్‌లో వచ్చారు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు నిరసన తెలిపారు. రేవంత్‌రెడ్డి కారులో ఉండి హాయ్ చెప్పడానికి ఇక్కడకు వచ్చారా? అని మండిపడ్డారు. జీప్ దిగివచ్చి తమ ఇబ్బందులను చూడాలని నినాదాలు చేశారు. కాలనీలో దాదాపు 15 నిమిషాలపాటు జీప్‌పై ఉన్న సీఎం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడాన్ని గమనించారు. కాలనీ సెంటర్‌కు వచ్చిన ఆయన అక్కడ జీప్ ఆపారు. పక్కనే ఉన్న మూతి సంతోశ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు.
ఇంటి పరిసరాలను చూసి తిరిగి వచ్చి జీప్ ఎక్కబోయారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సీఎం జీప్‌కు అడ్డంగా వచ్చి కింద పడుకునే ప్రయత్నం చేశాడు. ఈలోపే సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి మైక్ తీసుకొని మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆరంభం మొదలుకాగానే కాలనీవాసులు నినాదాలు చేశారు. ‘ప్రచారం వద్దు.. సాయం చేయండి’ అంటూ నినదించారు. ‘ఇంటికి రూ.పది వేల పరిహారం ఇస్తాం’ అని చెప్పే సమయంలో అన్ని వైపుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘మీరు ఇచ్చే రూ. పది వేలకు ఒక్క సామాను కూడా రాదు.. మీ 10 వేలు వద్దు.. మీరు వద్దు..’ అంటూ చేతులు ఎత్తి నినాదాలు చేశారు. రెండ్రోజులుగా నీళ్లలోనే ఉన్నప్పటికీ తమను పట్టించుకున్న వారే లేరని చెప్పడానికి సీఎం వద్దకు వెళ్తుండగా పోలీసులు పోలేపల్లి కాలనీ మహిళలను పక్కకు తప్పించారు. సీఎం పర్యటనకు కొద్ది గంటల ముందు మున్సిపల్ అధికారులు ఖమ్మంలోని బొక్కలగడ్డ ప్రాంతంలోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా తొలగించి బ్లీచింగ్ చల్లారు. రెండు రోజులుగా తమ ఇబ్బందులను పట్టించుకోని అధికారులు ఇప్పుడొచ్చి శుభ్రం చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనకు సీఎంకు తెలియజేసేలా ఆ ట్రాక్టర్లలోని వ్యర్థాలను అక్కడి రోడ్డుపై పోయించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినట్టు చేతులు ఊపుకుంటూ, టాటా చెప్పి వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం ఏమన్నా నీ ఇంటికి వచ్చి కలుస్తాడా?
మీడియాతో బాధలు చెప్పుకుంటున్న వరద బాధితులను కాంగ్రెస్ నాయకుడు మోసిన్‌ఖాన్ బెదిరించారు. ఖమ్మం కాంగ్రెస్ అడ్డా అని, ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారని హెచ్చరించారు. సీఎం ఏమన్నా నీ ఇంటికి వచ్చి కలుస్తాడా అంటూ మండిపడ్డారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మీడియా ప్రతినిధులను కూడా బెదిరించారు.
వరద బాధితుల ఆర్తనాదాలు
హుజూర్నగర్, కోదాడలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి పర్యటించగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురంలో 50 మందికిపైగా వరద బాధితులు సర్వం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా
నిత్యం సమస్యలతో సతమతమవుతున్నామని, వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట తలోడి గ్రామస్థులు ధర్నా చేశారు. సమస్యలపై పలుమార్లు కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీవో మహేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
తహసీల్దార్‌ను అడ్డుకున్న గ్రామస్థులు
తాగు నీటి సమస్య పరిష్కరించాలని విర్దండి గ్రామంలో సోమవారం తహసీల్దార్ పుష్పలత కారును ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. కలెక్టర్ పర్యటన అనంతరం తహసీల్దార్ విర్దండి నుంచి కౌటాలకు వచ్చే క్రమంలో గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు ఆమె కారును అడ్డుకున్నారు.
మణుగూరులో బస్తీ వాసుల బైఠాయింపు
మణుగూరు టౌన్: భారీ వర్షంతో తమ కాలనీ ముంపునకు గురైతే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని మేదర బస్తీవాసులు సోమవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కనీసం మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరగంటకు పైగా నినాదాలు చేశారు. ఓట్ల సమయంలో వచ్చి పలకరించిన ఎమ్మెల్యే బాధల్లో ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై మేడ ప్రసాద్ అక్కడికి చేరుకుని కాలనీవాసులకు నచ్చజెప్పి శాంతింపజేశారు.
అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఇళ్లల్లోకి నీళ్లొచ్చి, ఇండ్లు కూలిపోయి నిరాశ్రుయులైన వారు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ భరోసా కల్పించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు, మహబూబాబాద్, గంగారం మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె స్థానిక ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి పర్యటించారు. కేసముద్రం, ఇనుగుర్తి, గంగారం మండల కేంద్రాలు, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను సందర్శించారు. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. కూలిన ఇళ్లను, తడిసిన నిత్యావసర సరుకులు, తెగిన చెరవులు, వరదలో కొట్టుకపోయిన మూగజీవాలను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దండం పెడతా.. ఆదుకోండి
బయ్యారం: ‘రెండు రోజులుగా కురిసిన వర్షం కారణంగా వరదలో వరి పంట కొట్టుకుపోయింది. నష్టం వచ్చింది. దండం పెడతా ఆదుకోండి’ ఆంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం అల్లిగూడెం గ్రామానికి చెందిన రైతు కోడి మల్లేశ్ మంత్రి సీతక్క ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. వారం క్రితమే ఐదెకరాల్లో వరి పంట వేశానని, వరదతో పంట మొత్తం దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుపుతూ ‘దండం పెడతా ఆదుకోండి’ అంటూ కన్నీరు పెడుతూ వేడుకున్నాడు. బాధ పడొద్దని రైతుకు ధైర్యం చెప్పిన మంత్రి సీతక్క పంట నష్టాన్ని అంచానా వేయాలని తహసీల్దార్ విజయను ఆదేశించారు.
‘రేవంత్‌రెడ్డికి దోమలు కుడతాయని బ్లీచింగ్ చల్లుతున్నారా?
మేం చచ్చినా పర్లేదా? మూడ్రోజుల నుంచి తిండి, నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం’
మంత్రి సీతక్క కాన్వాయ్‌ని అడ్డుకున్న తండావాసులు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని కట్టతండా వాసు లు సోమవారం మంత్రి సీతక్క కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ముంపునకు గురైన పలు మండలాల్లోని గ్రామాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కేసముద్రం వచ్చిన మంత్రిని తమ ప్రాంతానికి రావాలని తండావాసులు కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో మంత్రి కాన్వాయికి అడ్డుతగిలారు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వారిని బలవంతంగా పక్కకు నెట్టివేయడంతో కాన్వాయి వెళ్లిపోయింది.
పొంగులేటి వస్తేనే నిరసన విరమణ
తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది పాలన ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలనని ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీల వాసులు ఆరోపించారు. మున్నేరు ముంపునకు గురైన తాము నీటిలో రెండు రోజులుగా అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఇసుమంతైనా సాయం అందలేదని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు నశించాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి తమ కాలనీలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక బైపాస్‌రోడ్డుపై సోమవారం రాస్తారోకో చేశారు. దాదాపు 500 మంది కాలనీవాసులు రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి పొంగులేటి తమ కాలనీలకు వచ్చి పరిశీలిస్తేనే తాము ఈ ఆందోళనను విరమిస్తామని, లేదంటే ఇక్కడినుంచి కదలబోమని మహిళలు స్పష్టం చేశారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా తమను నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగులేటి రాబోతున్నారని తెలుసుకున్న పోలీసులు నిరసనకారులపై విరుచుకుపడ్డారు. రాస్తారోకోను భగ్నం చేసేందుకు యత్నించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి పొంగులేటిపై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ‘అందరూ చచ్చాక వస్తే ఇంకా బాగుండేది కదా..’ అంటూ నినాదాలు చేశారు. తమకు పూర్తి న్యాయం చేయకపోతే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు ఓట్లేసి నిండా మునిగినం
జిల్లాలో ముగ్గురు మంత్రులు పేరుకే ఉన్నరు. వారి వల్ల మాకెలాంటి ఉపయోగమూ లేదు. వరదలు వస్తాయని ముందే అధికారులు వారికి చెప్పలేదా? చెప్తే వాళ్లు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? వాళ్ల బంధువులో, వాళ్ల కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చేస్తారా? ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని.. ప్రజలకు కష్టాలు రాగానే కన్పించకుండా పోయేవాళ్లని అనవసరంగా ఎన్నుకున్నం. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి నిండా మునిగినం.. మా బతుకుల్ని మేమే పాడు చేసుకున్నం. ప్రజలతో ఉండి, ప్రజల కోసం కష్టపడేటోళ్లని ఎన్నుకోకపోవడం మేం చేసిన తప్పు. అందువల్ల మాకే నష్టం జరిగింది.
-నసీమా, వెంకటేశ్వర నగర్ (ఖమ్మం)