ప్రభుత్వమే కాదు అటు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినట్టుంది. సర్కారు వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒక వైపు పంటలు ఎండిపోతుండగా.. మరోవైపు వడగండ్ల వానలు దాపురించాయి. నీళ్లు లేక పంట ఎండుతుండగా, అంతో ఇంతో పండుతుందనుకున్న పంటలపై శుక్రవారం రాళ్లవాన పడింది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాల్లో కురిసిన రాళ్లవానతో అనేక ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. పొట్టకొచ్చి ఈనే దశలో ఉన్న వరి, మక్కజొన్న తదితర పంటలు వడగండ్ల దెబ్బకు నేలకొరిగాయి. కొన్నిచోట్ల మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం, మక్కలు తడిపోయాయి.
Telangana | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కురిసిన వానకు వరి నేలవాలింది. వడగండ్లకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి నేలరాలింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారుపై పడ్డాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈదురుగాలులతో వర్ష బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లిలో వడగండ్ల వాన కురిసింది. కాగజ్‌నగర్‌లోని దుకాణాలపై కప్పులు ఎగిరిపడ్డాయి. పెద్దపల్లి జిల్లా మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వాన కురిసింది.
మెదక్ పట్టణంతోపాటు, మెదక్ రూరల్, పాపన్నపేట కోల్చారం మండలాల్లో వర్షం పడింది. మెదక్- హైదరాబాద్ రోడ్డుపై చెట్టు పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ పట్టణం జంబికుంట వీధిలో ఓ ఇంటిపై పిడుగుపాటు పడటంతో సిద్ధయ్య అనే వ్యక్తి ఇంట్లోని సామగ్రి ధ్వంసమైంది. పోతంశెట్టిపల్లి వైన్స్ సమీపంలో కరెంటుపోలు విరిగిపడి ఓ వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. 108లో మెదక్ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్షం కురిసింది. ధర్పల్లి మండలం వాడి, లింగంపేట మండలం లింగంపల్లి, పోతయిపల్లిలో పిడుగులు పడి రెండు గేదేలు, మూడు గొర్రెలు మృతి చెందాయి. జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలుల వాన కురిసింది. చొప్పదండి వ్యవసాయ మారెట్లో నిల్వ చేసిన మొకజొన్న ధాన్యం కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మిరుదొడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్, తొగుట మండలాల్లో వడగండ్లు పడ్డాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. శనివారం ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వడగండ్ల వానల పడనుండడంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మూడ్రోజులు వడగండ్ల వానలు..
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడ్రోజులపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మార్చి 24 నుంచి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇటు ఎండి..అటు తడిసి…
తెలంగాణలో ఒకవైపు వరిపంట కోతలకు సిద్ధమవుతుండగా మరోవైపు నీళ్ల కొరతతో చివరి తడులకు నీరందడం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లోని కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పొలంలో రైతు భూక్య రమేశ్ నాయక్
అసలే రకరకాల సమస్యలతో లబోదిబోమంటున్న రైతన్న పాలిట చెడగొట్టు వానలు పిడుగుపాటులా మారాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం
బండర్‌పల్లి గ్రామ శివారులో రాళ్లవానకు నేలకొరిగిన వరి