హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతున్నది. పగలంతా మండుటెండ, సాయంత్రానికి అకస్మాత్తుగా మబ్బులు కమ్మి, బలమైనగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ ఏడాది మే నెలలో ఎండలతోపాటు గతంలో కంటే ఎక్కువ రోజులు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తర, నైరుతి తెలంగాణలో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ అధికారు లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.