హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉపరితలద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 24 వరకు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు(గురువారం) ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శుక్ర, శనివారాల్లో అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రభావిత జిల్లాలకు ఈనెల 24వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో అత్యధికంగా 1.36 సెంటీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొంది.