Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఇక బుధవారం నుంచి శుక్రవారం వరకు పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే, వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్లే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరాఠ్వాడా వరకు ద్రోణి కేంద్రీకృతమై ఉందని వివరించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా.. రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.