CM KCR | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌ది మాస్టర్‌మైండ్.. ఆయన ఆలోచనలు అంతే భారీగా, తీవ్రంగానే ఉంటాయి. ఒకే నెలలో నాలుగు కీలక నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్‌లా తాకాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రతిపక్ష నేతలు కకావికలమయ్యారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించి మొదటి స్ట్రోక్ ఇచ్చారు. ఆ షాక్ నుంచి విపక్షాలు తేరుకోకముందే వీఆర్ఏల క్రమబద్ధీకరణ నిర్ణయం వెలువడింది. ఇది కక్కాలేక మింగలేక కొట్టుమిట్టాడుతున్న ప్రతిపక్షాలపై ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ మూడో అస్త్రం సంధించారు. దీన్నిచూసి నోటిమాట పడిపోయిన ప్రతిపక్షాలు తేరుకోకముందే.. రైతు రుణమాఫీతో మైండ్ బ్లాంక్ అయ్యేలా స్ట్రోక్ ఇచ్చారు. ఈ శర పరంపరతో ప్రతిపక్షాలు చెల్లాచెదురవుతుంటే.. ప్రజల్లో ప్రభుత్వ గ్రాఫ్ తారాజువ్వలా ఎగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతిచ్చే ఓట్ల శాతంలోనూ భారీ తేడా కనపడుతున్నది. ఇదే విషయాన్ని గురువారం శాసనసభ లాబీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మీడియాతో చెప్పారు. నాలుగు నిర్ణయాలకే ప్రతిపక్షాలు ఇలా అయితే.. కేసీఆర్ అమ్ముల పొదిలో ఉన్న అస్ర్తాలన్నీ ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
గిరివనంలో ‘పోడు’సంబురం
గిరిపుత్రుల చిరకాల స్వప్నాన్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారు. 26 జిల్లాల్లో 4,06,369 ఎకరాల భూమిని సాగుచేసుకొంటున్న 1,51,146 మంది రైతులకు అటవీ భూ యాజమాన్యహక్కు పత్రాలను పంపిణీ చేశారు. పోడు రైతుల మీద నమోదైన కేసులను ఎత్తివేస్తామని ప్రకటించి ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆయా భూములకు త్రీఫేజ్ కరెంట్‌ను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్క హక్కు పత్రంతో గిరిజనులకు మూడు ప్రయోజనాలు కల్పించారు.
21 వేల వీఆర్ఏ కుటుంబాల్లో దరహాసం
20,555 వీఆర్ఏల కుటుంబాల్లో సీఎం కేసీఆర్ శాశ్వత వెలుగు దివ్వెగా మారారు. సుంకరి, ఎలోడు, షేక్సింద్ ఇలా రకరకాల ఈసడింపు పేర్లతో పిలిచే కాలానికి కేసీఆర్ చెల్లుచీటి రాశారు. దీంతో వీఆర్ఏలను తమ ఎన్నికల దినుసుగా వాడుకోవాలనుకొన్న విపక్షాలకు వెన్నువిరిగినట్టు అయింది.
సర్కారులో ఆర్టీసీ విలీనంసీఎం కేసీఆర్ వదిలిన మరో అస్త్రం
సర్కారులో ఆర్టీసీ విలీనం. దాదాపు 43,373 మంది ఉద్యోగులున్న ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. విధి విధానాలు, ఆస్థులు ఇతర అంశాలను లోతుగా అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులతో కూడిన సబ్ కమిటీని నియమించారు.
రైతు రుణమాఫీ..
మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమనేది అందరూ ఒప్పుకొంటున్నదే. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతుభీమా లాంటి పథకాలను ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకున్నది. కరోనాకుతోడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణపై వివక్ష చూపటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రైతు రుణమాఫీలో కాస్త ఆలస్యమైంది. ఇబ్బందులను తట్టుకొంటూనే రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీఎం నిర్ణయించి, గురువారం నుంచే దానిని అమలుచేస్తుండటంతో రైతాంగంలో హర్షాతిరేకాలను రెట్టింపుచేశాయి. 29.61 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో ఉన్న రూ.19 వేలకోట్ల రుణాలను మాఫీచేస్తున్నారు.
తారా జువ్వలా సర్కారు గ్రాఫ్..
సీఎం కేసీఆర్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం మరింత బలపడింది. ప్రభుత్వం పట్ల సానుకూలత గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోతున్నది. ప్రతిపక్షాల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. పోడుపట్టాలతో అధికార పార్టీకి ఆ వర్గంలో ఒక్కసారిగా రెండుమూడు శాతం ఓట్ షేర్ పెరిగిందని తెలుస్తున్నది. ఆర్టీసీలోని 43 వేల మంది కార్మికులు ఇప్పుడు బీఆర్ఎస్కు గంపగుత్తగా మద్దతు తెలుపుతున్నారు. దీంతో మరో రెండు శాతం ఓట్లు అధికారపక్షానికి పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వీఆర్ఏల క్రమబద్ధీకరణతో బీఆర్ఎస్కు మరో రెండు శాతం ఓట్లు పెరగడం ఖాయమని అంటున్నారు. ఇక 29 లక్షల మందికిపైగా రైతులకు సంబంధించిన రుణమాఫీతో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత మరో 5-8 శాతం వరకు ఓట్ల రూపంలో మళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంటే నాలుగంటే నాలుగే నిర్ణయాలతో బీఆర్ఎస్కు ఓట్ల రూపంలో కనీసం 10-15 శాతం మద్దతు పెరగడం ఖాయంగా కనపడుతున్నది.
కేసీఆర్ అమ్ములపొదిలో మరెన్నో అస్ర్తాలు
సీఎం కేసీఆర్ నాలుగు నిర్ణయాలతోనే విపక్షాలను చెల్లాచెదురు చేశారు. కేసీఆర్‌ను క్షేత్రస్థాయిలో ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక ప్రతిపక్ష నేతలు జుట్టు పీక్కుంటున్నారు. కేసీఆర్ మదిలో ఇలాంటి అస్త్రశస్ర్తాలు అనేకం ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నాలుగు నిర్ణయాలకే ప్రతిపక్షాలు విలవిలలాడిపోతే.. సీఎం మరిన్ని అస్ర్తాలను సంధిస్తే విపక్షాలు నిలుస్తాయా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.