Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ, నిరాకరణ ఎదురైనట్టు ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో రాహుల్‌గాంధీ శుక్రవారం ఢిల్లీలో జార్ఖండ్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సుమారు 20 మంది ఎమ్మెల్యేలతో దాదాపు రెండు గంటలపాటు పిచ్చాపాటిగా చర్చలు జరిపారు. జార్ఖండ్ ఎమ్మెల్యేలకు రెడ్‌కార్పెట్ పరిచిన రాహుల్‌గాంధీ.. సీఎం రేవంత్‌ను కలిసేందుకు నిరాకరించారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. రెండ్రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాచినా రాహుల్ అంగీకరించలేదనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
అర్నెళ్లుగా నో అపాయింట్మెంట్
సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై రాహుల్ ఆగ్రహంతో ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సరైన విధానంలో పరిపాలన చేయకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, సీనియర్ నేతలను పట్టించుకోకపోవడం, వ్యక్తిగత ఎజెండా అమలుచేయడం వంటి అంశాలతో రాహుల్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. దీనికితోడు సీఎం రేవంత్‌పై సీనియర్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. వీటి కారణంగా కొద్దికాలంగా సీఎం రేవంత్‌ను రాహుల్‌గాంధీ దూరం పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ ఇద్దరు నేతల మధ్య ఆ తర్వాత దూరం పెరిగింది. రాహుల్‌గాంధీ సుమారు అర్నెళ్లుగా రేవంత్‌రెడ్డికి అపాయింట్ ఇవ్వలేదని తెలిసింది. తాజాగా రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై అధిష్ఠానానికి వివరించి, రాష్ట్రంలో నిర్వహించే భారీ బహిరంగసభలకు ఆహ్వానిస్తామంటూ సీఎంతోపాటు మంత్రులంతా ఢిల్లీ బాట పట్టారు. రెండ్రోజులపాటు ఢిల్లీలోనే వేసినప్పటికీ రాహుల్‌గాంధీ వీరికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.