హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ జరిగి 24 గంటలు గడిచిన తర్వాత కూడా శాఖల కేటాయింపు తతంగం ఇంకా పూర్తికాలేదు. శాఖల కేటాయింపు వ్యవహారం కాంగ్రెస్‌లో కొత్త కుంపటి రాజేస్తున్నట్టే కనిపిస్తున్నది. పలువురు కీలక నేతలకు సంబంధించిన శాఖల్లో జరుగుతున్న అవినీతి బాగోతాల చిట్టా మొత్తం అధిష్ఠానానికి చేరినట్టు సమాచారం. ఆయా శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ముఖ్యనేత, అధిష్ఠానానికి సన్నిహితంగా ఉండే ఒక మంత్రి, మరో కీలక మంత్రి పరస్పరం ఒకరిపై ఒకరు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఒకరి శాఖలో జరిగిన అవినీతిని మరొకరు.. అధిష్ఠానం ముందు పెట్టినట్టు ఢిల్లీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో శాఖల కేటాయింపులు, మార్పులపై సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డిని ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రశ్నించినట్టు సమాచారం. ఈ మూడు శాఖలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ శాఖలను మార్చాల్సిందిగా కేసీ వేణుగోపాల్ ప్రతిపాదించినట్టు తెలిసింది.
ఒకదశలో శాఖల మార్పులు, చేర్పుల్లో భాగంగా కీలక మంత్రికి, తమతో సన్నిహితంగా ఉండే మంత్రికి మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే దిశగా అధిష్ఠానం ఆలోచన చేసినట్టు తెలిసింది. అంతకుముందు ఈ ఇద్దరు నేతలు మున్సిపల్ శాఖలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ అధిష్ఠానానికి నివేదించారని, ఈ విషయంపై ముఖ్యనేతకు సమాచారం అందడంతో ఆయన కూడా ఆ ఇద్దరు మంత్రులపై ఫిర్యాదులు చేశారని తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఆర్థిక శాఖలో 20%, 30% కమీషన్ల వ్యవహారం, పౌర సరఫరాల శాఖలో ధాన్యం టెండర్లలో గోల్మాల్, ఫిలిప్పైన్స్ బియ్యం ఎగుమతిలో అవకతవకలపై అక్రమాలు జరిగాయంటూ ఒక చిట్టాను ముఖ్యనేత అధిష్ఠానం ముందు ఉంచినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు శాఖల్లో మార్పులు చేయాలని అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మళ్లీ ముఖంచాటేశారు. ఈసారి కూడా సీఎంకు ఆయన ఆపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. శాఖల మార్పులపై సోమవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సాయంత్రం 7 గంటలకు కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఆయనతో శాఖల మార్పులుపై చర్చించినట్టు సమాచారం. అయితే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ లభించకపోవడంతో శాఖల మార్పు అంశం ఫైనల్ కాలేదని తెలిసింది. ఖర్గే మంగళవారం ఉదయం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉన్నదని, ఆ తర్వాత జాబితా సిద్ధమవుతుందని సమాచారం. రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నం ఫలించలేదని తెలిసింది.