హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ సాక్షిగా బీసీలపై కాంగ్రెస్ కపటప్రేమ బయటపడింది. రాహుల్‌గాంధీ నుంచి మొదలుకొని సీఎం రేవంత్‌రెడ్డి వరకు చెప్పే మాటలన్నీ ప్రగల్భాలేనని తేలిపోయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నా వేదికే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకొన్న బీసీల ధర్నాకు ఆగ్రనేత రాహుల్ డుమ్మా కొట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ముఖం చాటేశారు. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కార్యక్రమం నిర్వహించినా కాంగ్రెస్ అగ్ర, కీలక నేతలెవరూ హాజరుకాలేదు. దీంతో బీసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపై కాంగ్రెస్ చూపిస్తున్న కపట ప్రేమకు ఇది నిదర్శనమని మండిపడుతున్నారు. హడావుడి తప్ప, రిజర్వేషన్లు సాధించాలనే తపన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ధర్నాకు రాహుల్‌తో పాటు ఇతర అగ్రనేతలంతా హాజరవుతారని కీలక నేతలు లీకులిచ్చారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ, ‘ఇండియా’ కూటమి కీలక నేతలు ధర్నాకు హాజరవుతారని చెప్పారు. తీరా రాహుల్ ముఖం చాటేయగా, ఇండియా కూటమి నేతల నుంచి మద్దతు కరువైంది. దీంతో ధర్నాకు కాంగ్రెస్ పెద్దలను, ఇతర నేతలను రప్పించడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, కార్యక్రమం అట్టర్‌ప్లాప్ అయ్యిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధర్నాకు రానోళ్లు రిజర్వేషన్లు ఇస్తారా?
బీసీల రిజర్వేషన్లు 42శాతానికి పెంపుపై కాంగ్రెస్ చెప్తున్న మాటలకు, చేస్తున్న చేష్టలకు మధ్య పొంతనలేదు. బీసీల రిజర్వేషన్ల పెంపు, కులగణన కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలుచేస్తామని రాహుల్ పదేపదే చెప్తున్నారు. ఇందుకు తెలంగాణ కులగణన, బీసీ రిజర్వేషన్లను మాడల్‌గా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ రాహుల్ చెప్తున్నవి నిజమే అయితే ఢిల్లీలో జరిగిన బీసీ రిజర్వేషన్ల ధర్నాకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌కు కులగణన, బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే బీసీల పోరాటానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. పోరాటానికి, ధర్నాకు మద్దతుగా రానోళ్లు రిజర్వేషన్లు ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
రెండు ధర్నాలకు రాహుల్ డుమ్మా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై పెద్దగా పట్టింపులేనట్టు అర్థమవుతున్నది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న రాష్ట్రంలో రెండు బీసీ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అంటూ రాష్ట్ర నేతలు ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నాచేసింది. ఇందులో బీసీలకు మద్దతుగా రాహుల్ గాంధీ పాల్గొంటారని ప్రకటించారు. కానీ ఆయన ఢిల్లీలో ఉండి కూడా ముఖం చాటేశారు. బుధవారం నిర్వహించిన బీసీ ధర్నాకు సైతం ఆయన హాజరుకాకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న హడావుడి ఆయనకు నచ్చడం లేదని, ధర్నాలకు హాజరై బదనాం కావడానికి బదులుగా దూరంగా ఉంటేనే ఉత్తమమనే భావనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాహుల్‌ను ప్రధాని చేసి రిజర్వేషన్లు సాధిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో బీసీలకు 42 రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కాదని సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఢిల్లీ జరిగిన బీసీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ను ప్రధాని చేసి రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పారు. ఇకపై రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీకి రాబోమని, గల్లీల్లో కొట్లాడుతామని ప్రకటించారు. రాహుల్ గాంధీ మాట శిలా శాసనమని, దానికి ఎదురొస్తే తెలంగాణ కాంగ్రెస్ మరణశాసనం రాస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదెప్పుడు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేదెప్పుడనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కనీసం బీసీల ధర్నాకు హాజరుకాని రాహుల్ గాంధీ, ప్రధాని అయ్యాక ఎలా రిజర్వేషన్లు పెంచుతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.