దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్‌కు డబ్బు కావాలి. కర్ణాటక నుంచి డబ్బు రావడం లేదు కాబట్టి కాంగ్రెస్‌కు మిగిలింది తెలంగాణ ఒక్కటే. ఇది ఆ పార్టీకి బంగారు బాతులా మారింది. అందుకే రిజర్వ్ బ్యాంక్‌గా మార్చుకునేందుకు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా కూడా వచ్చి మూసీని చూసిపోయిండు.
-కేటీఆర్
KT Rama Rao | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అంతా రాహుల్ గాంధీయేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మూసీ బ్యూటిఫికేషన్ రేవంత్‌రెడ్డిది కాదని, ఇది రాహుల్ ప్రాజెక్టు అని, పైసల కోసం ‘మూసీమే లూటో.. ఢిల్లీ మే బాంటో’ అన్నట్టుగా రాహుల్ డైరెక్షన్లోనే నడుస్తున్న డ్రామా ఇదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వ్
బ్యాంక్‌గా మార్చుకునేందుకే దీన్ని చేపట్టారని, రాహుల్ బావ రాబర్ట్ వాద్రా కూడా వచ్చి మూసీని చూసిపోయారని చెప్పారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి డబ్బు కావాలని, కర్ణాటక డిప్యూటీ సీఎం తనకు సీఎం పదవి ఇస్తేనే డబ్బులిస్తా అంటున్నాడని, ఇక మిగిలింది తెలంగాణే కాబట్టి మూసీపై కన్నేశారని, ‘ఇది బ్యూటిఫికేషన్ కాదు.. కచ్చితంగా లూటిఫికేషన్’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నదే రాహుల్ గాంధీ అని నిప్పులుచెరిగారు.
హర్యానా, యూపీలో బుల్డోజర్ మంచిది కాదంటూనే రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ పంపిస్తున్నాడని విమర్శించారు. మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. మూసీ సుందరీకరణకు 1.50 లక్షల కోట్ల ప్రతిపాదన ఎలా వచ్చిందో చెప్పాలని రేవంత్‌రెడ్డిని నిలదీశారు. ఇదివరకే ఎస్టీపీలు, బ్రిడ్జి పనులు చేపట్టామని, అయినా లక్షన్నర కోట్లు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.
మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చే సేందుకు.. కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంక్‌గా మార్చుకునేందుకు రేవంత్‌రెడ్డి పేదల కడుపులు కొడుతూ లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తూ నిర్దయగా వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తున్నదని కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం వివరాలపై అసెంబ్లీలో 3 గంటలపాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. మూసీ సుందరీకరణ వల్ల ఉపయోగాలపై కనీసం 3 నిమిషాలైనా చెప్పేటోడు ఉన్నాడా? అంటూ నిలదీశారు. అసలు ప్రాజె క్టు స్వరూపం ఎలా ఉంటుందో చెప్పేటోడు లేడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రికి, మంత్రులకు సయోధ్య లేనట్టు ఉన్నదని కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. సీఎం, మంత్రుల ప్రకటనలు, మీడియా సమావేశాలను చూస్తే ఇదే అర్థమవుతుందన్నారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రూ.1.50 లక్షల కోట్లని ఎవరు చెప్పారని అడుగుతున్నారని, ఆ అభినవ జోసెఫ్ గోబెల్స్ ఎవరంటే ఎనుముల రేవంత్రెడ్డేనంటూ ఎద్దేవాచేశారు. గోపనపల్లి ఫ్లై ఓవర్ ఓపెనింగ్ రోజు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే చెప్పారని స్పష్టంచేశారు. సీఎం ఆగస్టు 15నే రుణ మాఫీ అయిందని ప్రకటించాడని, అక్టోబర్ 1న వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పాడన్నారు. సీఎం ఫార్మాసిటీ రద్దు అని ప్రకటిస్తాడని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో ఫార్మాసిటీ రద్దు కాలేదని చెప్తూ మభ్య పెడుతున్నారని విమర్శించారు. మంత్రులకు శాఖల మీద పట్టు, అవగాహన లేదని, ముఖ్యమంత్రితో సమన్వయం లేదని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తిగా చేసుకోలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వంలో రూ.16వేల కోట్లతో మూసీని ఎలా అభివృద్ధి చేయాలనుకున్నామో త్వరలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడిస్తానని కేటీఆర్ తెలిపారు. ఎస్టీపీలు కట్టాలనుకొని కొన్ని కట్టామని, నాగోల్ పరిధిలో సుందరీకరణ కూడా చేశామని చెప్పారు. రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి గండిపేట జలాశయానికి గోదావరి జలాలను తెచ్చేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. మూసీ బాధితుల నుంచి 40, 50 లంచ్ మోషన్లు వచ్చినట్టు జస్టిస్ లక్ష్మణ్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 1.50 లక్షల కోట్లు, లక్షల మంది నిరాశ్రయుల వ్యవహరంపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదని, ఢిల్లీకి 23 సార్లు పోయి కనీసం 23 రూపాయలైనా తెచ్చావా? అని ప్రశ్నించారు. ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితులకు ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రభుత్వం పనితీరు ఎలాఉన్నదో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని చెప్పారు.
2,400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టు కిలోమీటరుకు రూ.17 కోట్లు ఖర్చయితే.. మూసీ సుందరీకరణలో కిలోమీటరుకు రూ.2700 కోట్లు అవుతాయట! ఇది స్కాం కాకపోతే మరేంటి? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ముఖ్యమంత్రి, మంత్రి చెప్పాలి
-కేటీఆర్
‘2400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టు కిలోమీటర్‌కు రూ.17 కోట్లు ఖర్చయితే మూసీకి కిలోమీటర్‌కు రూ.2700 కోట్లు అవుతాయా? ఇది స్కాం కాకపోతే మరేమిటి?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే, చేతనైతే మూసీ పరీవాహక ప్రాంతంలో ఇండ్లకు అనుమతులిచ్చిన అధికారుల తాట తీయాలంటూ రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 2048 వరకు ఈఎంఐ ఉన్నదని, తాను గర్భవతినని, తన ఇల్లు కూల్చితే ఈఎంఐ ఎవరు కట్టాలని, తన కుటుంబం, పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏమిటని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసిందని, ఈఎంఐలపై బ్యాంకులతో ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందా? అని ప్రశ్నించారు. మూసీపై దొంగ చాటుగా వచ్చి సర్వేలు చేసిపోతున్నట్టు ప్రజలు చెప్తున్నారన్నారు. అక్కడ కంపెనీలు పెడుతామని చెప్పిన ఒక్క కంపెనీ పేరైనా చెప్తారా? అని నిలదీశారు. హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని, రిజిష్ట్రేషన్ల ఆదాయం కుదేలైన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
గతంలో 16వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించినం. మూసీ సుందరీకరణలో భాగంగా ఎస్టీపీలు కట్టాలనుకున్నం.. కొన్ని చోట్ల కట్టినం. నాగోల్ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో సుందరీకరణ చేసినం. మూసీపై మా విజన్ ఏంటో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అతి త్వరలో వివరాలు వెల్లడిస్తా.
-కేటీఆర్
కేంద్రం సమ్మతితోనే హైడ్రాకు అధికారాలిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేశారని కేటీఆర్ చెప్పారు. శాసనసభలో అభిప్రాయాలు తీసుకోవాలనే సంస్కారం లేకుండా, హడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని నిలదీశారు. ఇప్పటికైనా సమావేశాలు పెట్టి ప్రజలు, ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిలగాడు పిలిచినా వస్తానని రాహుల్ గాంధీ చెప్పాడని, మరిప్పుడు ఏడని ప్రశ్నించారు.
తనకు తెలిసినంత వరకు మూసీపై ప్రభుత్వం దగ్గర ఎలాంటి రిపోర్ట్ లేదని చెప్పారు. దీనిపై కేంద్రబడ్జెట్లో నిధులివ్వలేదని అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు అడిగానని గుర్తుచేశారు. ఆ రోజు మాట్లాడటానికి సీఎం భయపడ్డారని, అయినా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలంటే రేవంత్‌కు భయమని, ఆ రోజే తాము సీఎం ఎందుకు మాట్లాటంలేదని అడిగినా స్పందించలేదని గుర్తుచేశారు. ఆ రోజు డిప్యూటీ సీఎం భట్టిని అడ్డంపెట్టి మాట్లాడించారని చెప్పారు. నమామి గంగేకు నిధులిస్తారు, మూసీ సుందరీకరణకు ఇవ్వలేదని భట్టి ఆరోపించారని, ఆ సందర్భంగా తాను మూసీ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించారా? అని అడిగితే, డీపీఆర్ సమర్పిస్తే కదా డబ్బు ఇచ్చేది, డీపీఆర్ సిద్ధమవుతున్నది అని చెప్పినట్టు గుర్తుచేశారు.
మల్లన్న సాగర్ కట్టినప్పుడు పునరావాస కాలనీ కట్టి వారిని అక్కడికి తరలించి ప్రాజెక్టు మొదలు పెట్టామని కేటీఆర్ గుర్తుచేశారు. మూసీపై కనీసం ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని, సోషల్, పర్యావరణ సమస్యపై సర్వేలైనా చేశారా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కిర్లోస్కర్ కమిటీ 28వేల అక్రమణలు ఉన్నాయని నివేదిక ఇచ్చిందని, మూసీలో మరో 12 వేల అక్రమణలు ఉన్నాయని తేలిందని, వారికి పునరావాసం లేకుండా ప్రాజెక్టు చేపట్టడం సరికాదన్న ఉద్దేశంతోనే పక్కకు పెట్టామని చెప్పారు. మంత్రులు సెక్యూరిటీ లేకుండా మూసీ ప్రాంతాల్లో పర్యటించాలని సవాల్ విసిరారు. కూల్చివేస్తున్న ఇండ్ల నుంచి వసూలు చేసిన పన్నులన్నీ వాపస్ ఇస్తారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్లు కాలేదని, మూసీకి రూ.1.50లక్షల కోట్లు ఎలా అవుతాయంటూ నిలదీశారు.
కచ్చితంగా లూటిఫికేషన్.. ఈ ప్రాజెక్టు రేవంత్‌రెడ్డిది కాదు.. రాహుల్ ప్రాజెక్టు. పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నదే రాహుల్ గాంధీ..
-కేటీఆర్