Harish Rao | గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోయేనున్నట్లు నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. నీళ్లు లేక వెలవెలబోతున్న జిల్లాలోని రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని రెండురోజుల కిందట మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాసిన విషయం తెలిసిందే. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో నీళ్లు నిండుకున్న విషయాన్ని గ్రహించి హరీశ్‌రావు తనదైన శైలిలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఇదే సమయంలో రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉన్నాయని, ప్రస్తుతం అడుగంటిపోయిన విషయాన్ని వివరాలతో సహా లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు ఆదివారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పందించారు. హరీశ్‌రావు రాసిన లేఖ అందిందని తెలిపారు. రేపటి నుంచి మిడ్ మానేరు ద్వారా నీటిని ఎత్తిపోయనున్నట్లు తెలిపారు. దాంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.