Vakiti Srihari | మహబూబ్‌నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో.. నీ భరతం పట్టడం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం ఖాయం’ అని పేర్కొంటూ సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో విడుదలైన లేఖ కలకలం సృష్టిస్తున్నది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, రెడ్డి సామాజికవర్గ మంత్రులను హెచ్చరిస్తూ ఈ లేఖలు గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కొంతమందికి పోస్ట్ ద్వారా అందాయి. గతంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దని.. అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆయనకు వ్యతిరేకంగా సిరీస్ లేఖలు విడుదల చేశారు. తర్వాత ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం, మంత్రులను హెచ్చరిస్తూ తాజాలేఖ విడుదలైంది. పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే ఆదేశాలతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ లేఖతో ముదిరాజ్ సామాజిక వర్గానికి.. పార్టీకి సంబంధం లేదని, కొందరు కావాలని సృష్టిస్తున్నారని ఆ పార్టీ ముదిరాజ్ నాయకుడు కోళ్ల వెంకటేశ్ వెల్లడించారు.
‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం, మంత్రులకు హెచ్చరిక.. మేము (ముదిరాజ్ సామాజిక వర్గం) తెలంగాణ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నం. మా సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎన్నికయ్యారు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఊసెత్తడం లేదు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా మీరు అడ్డుపడుతున్నరు. మా ఎమ్మెల్యేకు టికెట్ మీ దయా దాక్షిణ్యాలపై రాలేదు.. ఆయనపై మల్లికార్జున ఖర్గే ఆశీస్సులున్నయి. నువ్వు.. నీ సామాజిక వర్గంవారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంత్రి పదవి ఖాయం. నువ్వు నీలం మధు ముదిరాజ్తో కుమ్ముకై వంద కోట్ల బేరం కుదుర్చుకొని అతడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నం చేసినవు. ఈ విషయం ఏఐసీసీకి తెలిసి నీకు మొట్టికాయలు వేసింది. ఖబడ్దార్ బిడ్డా.. నీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం అనివార్యం’