Raging | లక్షెట్టిపేట, ఆగస్టు 4: మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మహత్మా జ్యోతిబాఫూలే పాఠశాల విద్యార్థులు ఆదివారం ర్యాగింగ్‌తో హంగామా సృష్టించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థిపై చేయిచేసుకున్నారు. ప్రిన్సిపల్ రోనాల్డ్ కిరణ్ వారిని మందిలించే ప్రయత్నం చేయగా, తనపై కూడా సీనియర్లు దురుసుగా ప్రయత్నించినట్టు సమాచారం. ర్యాగింగ్ పేరిట జూనియర్లను వేధించే సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపాల్ సన్మార్గంలో పెట్టేందుకు యత్నిస్తే.. పేరెంట్స్ వచ్చి తమ పిల్లల్ని కొడుతున్నారంటూ ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు చేయడం చర్చానీయాంశంగా మారింది.
పేరెంట్స్.. స్టాఫ్ మాట్లాడుతున్న సమయంలో మరోమారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థి తరుణ్‌ను చితకబాదారు. దీంతో కోపోద్రిక్తుడైన తరుణ్ ఒక్కసారిగా కిటికీ అద్దాన్ని చేతితో గుద్దడంతో తీవ్ర రక్తస్రావమైంది. పాఠశాల సిబ్బంది అప్రమత్తమై తరుణ్‌ను లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మంచిర్యాల దవాఖానకు తరలించారు. తరుణ్ చేతి నరం తెగిపోయిట్లు సమాచారం. పోలీసులు పాఠశాలకు వెళ్లి విచారణ చేపడుతున్నారు. ప్రిన్సిపాల్ రోనాల్డ్ కిరణ్‌ను వివరణ కోరగా, గొడవ జరిగిన విషయం వాస్తవమేనని, విచారణ చేపడుతున్నామని తెలిపారు.