హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యాదినోత్సవం నిర్వహించనున్నది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతోపాటు, బడుల ప్రారంభం, పుస్తకాల పంపిణీ వంటివి చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 విద్యార్థులకు ఉదయం 250 మిల్లీలీటర్ల రాగిజావ అందించే కార్యక్రమాన్ని నేడు ప్రారంభిస్తారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆధునికీకరించిన వెయ్యి బడులను ప్రారంభిస్తారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు మూడు చొప్పున వర్క్‌బుక్స్, 6 నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులకు ఒకటి చొప్పున నోటుపుస్తకాలు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్‌లను పంపిణీ చేస్తారు. 1,600 పాఠశాలల్లోని 4,800 డిజిటల్ తరగతులను ప్రారంభిస్తారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. 5వేల పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లను ప్రారంభిస్తారు.
విద్యలో సంస్కరణలు ఇలా..
ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలోనూ ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్‌కు విస్తరించారు. దివ్యాంగ పిల్లల కోసం 467 భవిత కేంద్రాలను నిర్వహిస్తుండగా వారి తల్లిదండ్రులకు రూ. 3,500, బాలికలకు ఏడాదికి రూ. 2 వేల చొప్పున స్కాలర్షిప్లు అందిస్తున్నారు. 12 పాలిటెక్నిక్ కాలేజీలను కొత్తగా మంజూరు చేసిన ప్రభుత్వం 15 కాలేజీలకు సొంత భవనాలు, 22 హాస్టళ్లు నిర్మించింది. విద్యాశాఖలోని 3,997 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించింది. 2014 తర్వాత కొత్తగా 15 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఇంటర్లో డిజిటల్ ఆన్‌స్క్రీన్ మూల్యాంకానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించింది. కొత్తగా మహిళా వర్సిటీ, హార్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వర్సిటీలను నెలకొల్పింది. గురుకులాల్లో విద్యనభ్యసించిన 930 మంది డాక్టర్లుగా, 1517 మంది ఇంజినీర్లుగా ఎదిగారు. ముస్లిం బాలికల కళాశాల విద్యలో జాతీయస్థాయిలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలవగా, పాఠశాల విద్యలో మూడోస్థానంలో నిలిచింది.
Pp