హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరోక్షంగా ఒప్పుకొన్నారు. పార్టీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని, ఈ విషయంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. శుక్రవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బండి సంజయ్‌తో ఉన్న అభిప్రాయ భేదాలపై ప్రశ్నించగా.. ‘ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అభిప్రాయ భేదాలు సహజం’ అని వ్యాఖ్యానించారు. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదా? అన్న ప్రశ్నకు ‘ఈ విషయంలో నాకు అసంతృప్తి ఉన్నది. దీని గురించి పార్టీ పెద్దలకు తెలియజేశాను. వారు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రఘునందన్ వ్యాఖ్యలతో బీజేపీలో కొద్దిరోజులుగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయన్న వార్తలు నిజమని తేలాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ప్రొటోకాల్ వివాదమే తాజా ఉదాహరణ అని పేర్కొంటున్నారు. పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి దక్కినప్పటి నుంచే రఘునందన్‌రావు అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. అప్పట్లో ఇద్దరూ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించారు. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి రఘునందన్ ఓడిపోవడం, ఎంపీగా బండి సంజయ్ గెలువడంతో అధిష్ఠానం ఆయనవైపు మొగ్గుచూపింది. దీంతో 2020లో బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచే రఘునందన్ కాస్త అసంతృప్తిగా ఉన్నా, పదవి లేకపోవడంతో సైలెంట్‌గా ఉన్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో తన అసహనాన్ని వివిధ సందర్భాల్లో బయటపెడుతున్నారని కమల దళం కార్యకర్తలు చెప్పుకొంటున్నారు.