గుండాల కృష్ణ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మైనింగ్‌లకు వేదికగా ఉండే భూముల విషయంలో సీఎం తీరు సేరు అంటే.. మంత్రి పొంగులేటి తీరు సవ్వాసేర్! అన్నట్టుగా తయారైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామ సరిహద్దులోని భూమిలో నిర్వహిస్తున్న క్రషర్ అక్రమమని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చింది. అయితే ఆదిలోనే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిదిగా వెల్లడైనా దాన్ని కప్పిపుచ్చుకొనేందుకు తెరపై ఇతర కంపెనీలను ఉంచి రోజంతా హైడ్రామా నడిపారు. అయినా సర్కారే అది రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌గా ప్రకటించడంతో పొంగులేటి ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలుగా మారాయి. వ్యవహారం లోతుల్లోకి వెళితే.. ఇందులో కేవలం అక్రమ క్రషర్ దందా మాత్రమే కాదు.. తెర వెనుక వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని చెరబట్టే స్కెచ్ కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.
శంషాబాద్ రెవెన్యూ మండల పరిధిలోని కొత్వాల్‌గూడ సర్వేనంబర్ 55-63, 65-68, 70-72ల్లో 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ సర్వేనంబర్లలోని భూమిని 1978లో కొత్వాల్‌గూడకు చెందిన కొందరు పేద రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 200 ఎకరాలను అసైన్డ్ చేశారు. అప్పట్లో కొండలు, గుట్టలు ఉండటంతో వ్యవసాయానికి అనుకూలించదంటూ అసైనీలు ఆ భూములను వాడుకలోకి తీసుకోలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం తిరిగి పీవోటీ యాక్టు ప్రకారం ఆ భూములను 2008లో స్వాధీనం చేసుకున్నది.
అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ భూముల్లో పెద్ద టౌన్‌షిప్స్, కమర్షియల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ద్వారా ‘దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డిం గ్స్’ (దిల్) కంపెనీకి 350 ఎకరాలు కేటాయించింది. కానీ దిల్ కంపెనీ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ఈ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నది. అప్పటి నుంచి ఈ భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో సర్కార్/సీలింగ్ సర్‌ప్లస్‌గా కొనసాగుతున్నాయి.
కొత్వాల్‌గూడలోని రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ దగ్గరికి గతంలో బీఆర్ఎస్ బృందం వెళ్లి పరిశీలన చేసిన తర్వాత అదేరోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. పాత అసైనీలను మీడియా ముందుకు తీసుకువచ్చి రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తాము ఇక్కడ క్రషర్ ఏర్పాటు చేసి వారికి లీజు కింద డబ్బులిస్తున్నామని ప్రకటించారు. రైతులతో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ ద్వారా తమ బతుకులు బాగుపడుతున్నాయని చెప్పించారు. కానీ వాస్తవానికి సదరు అసైనీల నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పీవోటీ కింద ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నది.
అయినా పాత అసైనీలకు దశాబ్దాల కిందట భూములు పంపిణీ చేసిన సమయంలోనూ ఇచ్చిన పట్టాలో స్పష్టంగా లీజు, ఆర్థిక లావాదేవీల కింద క్రయ విక్రయాలు చేసుకోవద్దనే నిబంధన పొందుపరిచారు. దీంతో అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్కడ క్రషర్ ఏర్పాటు చేయడమే అక్రమం. అటు లీజుకిచ్చే అధికారం పాత అసైనీలకు లేదు. ఇటు ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు లేవు. అంటే ప్రభుత్వ భూమిలో దౌర్జన్యంగా అక్రమ క్రషర్ ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతున్నది.
ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్స్ పాత అసైనీలను తెరపైకి తెచ్చి ఒప్పంద డ్రామా మొదలుపెట్టింది. ఇందుకు పాత అసైనీల దగ్గర ఉన్న పాత పాస్ పుస్తకాలను అడ్డు పెట్టుకొని రాత్రికి రాత్రి భూ భారతిలో రికార్డుల్ని తారుమారు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాలను చక్కబెట్టేందుకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన కుమారరాజు అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలు కొత్వాల్‌గూడ భూముల చుట్టే తన కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నట్టు తెలిసింది. పాత అసైనీలను కొంతమందిని ఒక్కొక్కరుగా కలిసి వారి నుంచి పాత పాస్ పుస్తకాలతో పాత తేదీల్లో ఒక్కొక్కరి నుంచి 33 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఇలా దశాబ్దాల కిందట ఉన్న పాత అసైనీలు అందరి నుంచీ లీజు ఒప్పందాలు చేసుకొని ఏదో ఒక తిరకాసుతో రికార్డుల్లోకి ఎక్కించాలనే భారీ పన్నాగం ఈ క్రషర్ ఏర్పాటు వెనుక ఉన్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.