
గజ్వేల్/మర్కూక్, డిసెంబర్ 27: సీఎం దత్తత గ్రామం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామస్థులు ఒక్కటయ్యారు. గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్వహించ తలపెట్టిన రచ్చబండను అడ్డుకొన్నారు. కలిసిమెలిసి ఉంటున్న గ్రామస్థుల మధ్య లొల్లి పుట్టించేందుకు ప్రయత్నించొద్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ గ్రామంలో రచ్చబండ అవసరం లేదంటూ సోమవారం ఉదయం 8 గంటల నుంచే గ్రామస్థులు చౌరస్తాలో బైఠాయించారు. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చారని, ఉపాధి అవకాశాలను కల్పించారని తెలిపారు. రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్, పాండురంగ రిజర్వాయర్‌తో సాగునీటి వసతి కల్పించారని చెప్పారు. వాటితో 365 రోజులు వ్యవసాయం చేసుకొంటూ ఈ ప్రాంత రైతులమంతా సంతోషంగా ఉంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తమ భూములన్నీ బీడుగానే ఉండేవని.. నీళ్లు లేక, కరెంటు లేక ఇబ్బందిపడ్డ సంగతిని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తమ గ్రామాన్ని దత్తత తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. సంబురంగా ఉన్న సమయంలో రచ్చబండ పేరుతో గ్రామంలో కాంగ్రెస్ ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నదని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో రచ్చబండ నిర్వహించేది లేదంటూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, సర్పంచ్ భాగ్యభిక్షపతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాల్‌రాజు, ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ, నాచారం ఆలయ కమిటీ చైర్మన్ హరిపంతులు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆందోళనలో పాల్గొని గ్రామస్థులకు మద్దతు తెలిపారు. కాగా, గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇటిక్యాల రహదారి గుండా గ్రామంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకొని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మా ఊర్లో రచ్చబండ పెట్టుడు అవసరమా?
సీఎం కేసీఆర్ సార్ కోట్ల రూపాయలతో మా ఊరినే మార్చిండ్రు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిండ్రు. మా ఊర్ల ప్రతి ఎకరానికి డ్రిప్‌లు ఇచ్చిండ్రు. ఇప్పుడు రకరకాల పంటలు వేసుకొంటున్నం. కాంగ్రెస్ రేవంతు గీడికి వచ్చి ఈ రచ్చబండ పెట్టుడు అవసరమా. మా ఊర్ల అందరం కలిసిమెలిసి ఉన్నం. పంచాయితీ పెట్టనీకి మా ఊరికి రాకుండ్రి.
కేంద్రం దగ్గర కొట్లాడు..
మేము వడ్లు పండిస్తే కేంద్రం వండ్లు కొనబోమంటున్నది. దీనికి కేసీఆర్ ఏం చేస్తడు. దమ్ముంటే కేంద్రం దగ్గర పొయ్యి కొట్లాడు. మా వడ్లు కొనేటట్టు చెయ్యి. అప్పుడు మా ఊరికొచ్చి మాట్లాడు. కేసీఆర్ మాకు రైతుబంధు ఇస్తుండు, రేపు మల్లా పడుతుంది. రైతుబీమా ఇస్తుండు. మంచిగ ఎవుసం చేసుకుంటున్నం. మా ఊరికి వచ్చి చూడు పంటలు ఎంతమంచిగున్నయో… మా ఊరికి వచ్చి రచ్చబండతో పంచాయితీ పెట్టుడు అవసరమా.