హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పసిపిల్లలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా భారీ నెట్‌వర్క్‌ను రాచకొండ పోలీసులు ఛేదించి 16 మంది బాలలను రక్షించగా, మరో 9 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠాను గత నెలలో మల్కాజిగిరి ఎస్వోటీ, చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఆ ముఠాలోని నిందితులను విచారించగా ఐదు మాడ్యూల్స్ సమాచారం లభించిందని రాచకొండ పోలీ స్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు.
కీలక నిందితురాలైన అమూల్యతోపాటు ఆమెకు సహకరించిన మహారాష్ట్రకు చెందిన వైశాలి భీమ్రావు వాస్నిక్, హైదరాబాద్‌కు చెందిన జన్‌పల్లి కార్తీక్, సజ్జన్ అగర్వాల్, బానా ల మంగయ్య, రఘురామ్ అశోక్, షేక్ ఇస్మాయిల్, మాచర్ల వంశీకృష్ణ, ఆసిఫాబాద్‌కు చెందిన బోదాస్ నాగరాజుతోపాటు పిల్లలను కొనుగోలు చేసిన 27 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్ ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన కోల కృష్ణవేణి, దీప్తి ముఠా గజరాత్కు చెందిన వందనతో కలిసి పసిపిల్లలను విక్రయిస్తున్నట్టు గుర్తించినట్టు సీపీ తెలిపారు.
ఈ ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులను విచారించగా వేర్వేరు నెట్‌వర్క్‌ల సమాచారం లభించిందని వివరించారు. దాని ఆధారంగా పసిపిల్లల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు విస్తరించిన ఈ నెట్వర్క్ గురించి ఆరా తీసి తాజాగా 16 మంది ని కాపాడామని తెలిపారు.
తొలుత హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన ఆశ వర్కర్ అమూల్య, మలక్‌పేట్ ఏరియా దవాఖానలో సూపర్వైజర్ ఇస్మాయిల్ కలిసి పిల్లల విక్రయాలకు తెరలేపారని తెలిపారు. అమూల్య బంధువైన చౌటుప్పల్‌కు చెందిన పిల్లలులేని సుగుణమ్మకు మగపిల్లవాడిని విక్రయించారని, అందులో రూ.30 వేల చొప్పున ఇద్ద రూ పంచుకున్నారని తెలిపారు. అమూల్యకు కృష్ణవేణి, దీప్తి టీమ్‌తో పరియం ఏర్పడిందని వివరించారు. మొదట ఒకటి, రెండుసార్లు ముగ్గురూ కలిసి ప్లిలలను విక్రయించారని, ఆ తర్వాత కృష్ణవేణి, అమూల్య, దీప్తి వేర్వేరుగా విక్రయిస్తూ తమ సొంత నెట్‌వర్క్‌లను ఏర్పరుచుకున్నారని వివరించారు.