హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ రాష్ట్ర ప్రజలను అవమానించారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీహారీలను చులకనగా చూస్తారని, ఢిల్లీలో కూర్చొని నవ్వుకుంటారన్నారు. కానీ ఎన్నికల వేళ బీహార్‌కు వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణలో రేవంత్‌రెడ్డి టీడీపీలో, ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం అయిన కొత్తలో ఓ సమావేశంలో మాట్లాడుతూ బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యర్థి కేసీఆర్‌ను విమర్శించే క్రమంలో ఆయన సలహాదారులంతా బీహార్‌కు చెందినవారేనని, వాళ్లు రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు.
ఈ క్రమంలో తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు కూలి పనులు చేయడం బీహార్ ప్రజల డీఎన్ఏలోనే ఉన్నది. కానీ కేసీఆర్ వాళ్లకు అధికారం ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు’ అని ప్రశాంత్‌కిషోర్ పేర్కొన్నారు. బీహార్ ప్రజలపై కాంగ్రెస్‌కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీహారీల పట్ల ఉన్న నిబద్ధతను ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని బీహార్‌కు వస్తారని ప్రశ్నించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు నిజమో, అబద్ధమో రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశాంత్‌కిశోర్ చేసిన వ్యాఖ్యలు అటు బీహార్‌తోపాటు తెలుగు రాష్ర్టాల్లోనూ వైరల్‌గా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డి నోటి దురుసును ప్రస్తావిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఐఏఎస్ అధికారులందరినీ బీహార్బ్యాచ్ అని రేవంత్ రెడ్డి సంబోధించారని గుర్తుచేస్తున్నారు.